KCR: అమెరికాకే అప్పులు ఉన్నాయి... అప్పులపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: టీవీ 9 ఇంటర్వ్యూలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

  • ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వాలు అప్పులు చేస్తాయన్న కేసీఆర్
  • తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం
  • కాంగ్రెస్ సభలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయన్న కేసీఆర్
  • బజారు మాటలు వేరు... పరిపాలన వేరన్న కేసీఆర్
KCR with tv9 on Telangana debt

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్ద మొత్తంలో అప్పులు చేశారన్న కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వాలు అప్పులు చేస్తాయన్నారు. మంగళవారం టీవీ9లో 'లైవ్ షో విత్ కేసీఆర్' కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత మాట్లాడుతూ... తమపై కాంగ్రెస్ నేతలు నిత్యం అప్పులు ఎక్కువ చేశారని విమర్శలు చేస్తున్నారని... కానీ అత్యంత ధనిక దేశమైన అమెరికాకే ఎక్కువ అప్పులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ బడ్జెట్‌కు... ప్రయివేటు వ్యక్తి బడ్జెట్‌కు తేడా ఉంటుందన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.

అప్పులపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. ఆడిట్ లెక్కలను కూడా కాంగ్రెస్ కాకిలెక్కలుగా చెబుతోందని మండిపడ్డారు. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమన్నారు. అప్పుల్లో తెలంగాణ 24వ స్థానంలో ఉందని గుర్తించాలన్నారు. అత్యధిక మూలధనం వ్యయం చేసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. అప్పులపై అసెంబ్లీలో జరిగిన చర్చ చూసి తనకు నవ్వు వచ్చిందని ఎద్దేవా చేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక అప్పులకు సంబంధించి పరిమితి విధించారన్నారు. ప్రతిపక్షాలను దెబ్బకొట్టేందుకు మోదీ అలా చేశారన్నారు. 

కాంగ్రెస్ సభలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి

కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయన్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర... దీనిని ఎవరూ కాదనలేరన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని అసెంబ్లీలోనే అన్నవాళ్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఒక చిన్న మతకల్లోలం లేకుండా తాము పదేళ్లు పాలించామని తెలిపారు. తమను ప్రజలు తిరస్కరించలేదని... మూడొంతుల సీట్లు వచ్చాయని తెలిపారు.

విభజన తర్వాత ధ్వంసమైన, శిథిలమైన తెలంగాణ తమ చేతికి వచ్చిందన్నారు. సమైక్య పాలనలో చెరువులను గాలికి వదిలేశారన్నారు. కానీ తాము తెలంగాణను అభివృద్ధిలో నిలిపామన్నారు. ధ్వంసమైన తెలంగాణను తాము పునర్నిర్మించామన్నారు. ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని వ్యాఖ్యానించారు. అప్పట్లో 'ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర' అన్నారని... కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. పాలనను గాలికి వదిలేసిందన్నారు. బజారు భాష మాట్లాడటం వేరు... పరిపాలన వేరు అన్నారు. కాంగ్రెస్ శ్వేతపత్రాలు అన్నీ బోగస్ పత్రాలే అన్నారు. కాంగ్రెస్ బట్టకాల్చి మీద వేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయ పేరుతో తాము చెరువులను బాగు చేశామన్నారు.

వనరులను వాడుకోలేని దద్దమ్మలు.. అసమర్థులు

కరెంట్ విషయంలోనూ కాంగ్రెస్ వెకిలి ప్రయత్నాలు చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఏం చేసినా అసలు నిజాలు ప్రజలకు తెలియకుండా చేయలేదన్నారు. విద్యుత్ ఒప్పందాలలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తాము రూ.13కు విద్యుత్‌ను కొనుగోలు చేసినట్లు ఆరోపించారని.. కానీ అంతమొత్తానికి కొనుగోలు చేయలేదన్నారు. కేసీఆర్ అధికారంలో నుంచి దిగిపోగానే పవర్ కట్స్ ఎందుకు అవుతున్నాయి? మోటార్లు ఎందుకు నడవడం లేదు? అని ప్రశ్నించారు. తాము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామన్నారు. విద్యుత్‌కు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. అందుకే ఉన్న వనరులను, విద్యుత్‌ను వాడుకోలేని అసమర్థులు... దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్లు అని తీవ్ర విమర్శలు చేశారు.

More Telugu News